వైసీపీలోకి దాసరి కొడుకు

Thursday, 9 August 2018
పవన్‌కళ్యాణ్ ఎంట్రీతో ఏపీ పాలిటిక్స్‌లో మళ్ళీ సినిమాటిక్ కరిష్మాకు వ్యాల్యూ అమాంతం పెరిగింది. టీడీపీలో  బాలయ్య, వైసీపీలో రోజాల దగ్గరే ఆగిపోయిన సినిమా రాజకీయం మళ్ళీ ఊపందుకుచే ఛాయలు కనిపిస్తున్నాయి. జనసేనలోకి ఇప్పటివరకూ టాలీవుడ్ నుంచి ప్రత్యక్ష ప్రవేశాలు జరగనప్పటికీ.. ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఆ విషయంలో కాస్త ముందడుగేస్తోంది. జగన్ పాదయాత్రలో చిన్నాపెద్దా నటీనటులు ఒక్కరొక్కరుగా వచ్చి ‘తీర్థం’ పుచ్చుకుంటున్నారు. కమెడియన్ పృథ్వి, రచయిత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని.. నిన్న ‘వినాయకుడు’ ఫేమ్ కృష్ణుడు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. త్వరలో దాసరి నారాయణరావు కొడుకు అరుణ్‌కుమార్ కూడా జగన్‌ని కలిసి పార్టీలో చేరిపోతారని తెలుస్తోంది.


ఈ విషయాన్ని పృథ్వీ స్వయంగా వెల్లడించాడు. ”మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులని, పెయిడ్ కుక్కలని సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారు.. అవును మేము జగన్ పట్ల విశ్వాసమున్న కుక్కలం” అంటూ గుంటూరు గర్జన సభలో ఆవేశంగా ప్రసంగించిన పృథ్వి.. త్వరలో వైసీపీలోకి దాసరి కొడుకు అరుణ్ రాబోతున్నాడంటూ ప్రకటించారు. అరుణ్ కుమార్ కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేసి.. కెరీర్లో సక్సెస్ దక్కకపోవడంతో ఫేడవుట్ అయ్యారు. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఏదైనా టిక్కెట్ ఆశిస్తున్నారా అంటూ వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.