ఆ మూడు జిల్లాల్లో టీడీపీకి ఎదురులేదు!

Monday, 13 August 2018



వైసీపీకి ఇప్పుడు మూడు జిల్లాల్లో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఫ‌లితంగా జ‌గ‌న్ ల‌క్ష్యమైన అధికార పీఠంపై పెద్ద ఎత్తున ప్ర‌భావం చూపుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. ప‌శ్చిమ గోదావ‌రి, తూర్పు గోదావ‌రి, విశాఖ జిల్లాల్లో వైసీపీకి ఇప్పుడు ఎదురు గాలి వీస్తోంద‌నే విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆ పార్టీ అధినేత జ‌గ‌నేన‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని జ‌గ‌న్ ఎంతో కృషి చేస్తున్నారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు జైకొట్టిన మూడు జిల్లాల్లో వైసీపీ నాయ‌కులు ఇప్పుడు డోలాయ‌మానంలో ప‌డ్డార‌ని తెలుస్తోంది.ముఖ్యంగా కాపు సామాజిక‌వర్గం డామినేష‌న్ ఎక్కువ‌గా ఉన్న ఈ మూడు జిల్లాల్లోనూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల ప్ర‌భావం తీవ్రంగా క‌నిపిస్తోంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సానుభూతి కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల మూలంగా కొట్టుకు పోయింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎం కావ‌డానికి ఈ మూడు జిల్లాలు ఎంతో స‌హ‌క‌రించాయి. మ‌రి ఈ జిల్లాల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని ముందుకు సాగ‌డంలో జ‌గ‌న్ విఫ‌ల‌మ‌వుతున్నార‌ని, కొన్ని విష‌యాలు నిజాలే అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయంగా లౌక్యం చూపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, కానీ, త‌మ నేత అలా చేయ‌డం లేద‌ని కాపు వ‌ర్గానికి చెందిన కొంద‌రు సీనియ‌ర్లే చెబుతుండ‌డం ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.


కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అంశం అనేది కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న విష‌య‌మేన‌ని, ఇప్పుడు కొత్త‌గా తెర‌మీదికి వ‌చ్చింది లేద‌ని, అంద‌రూ దీనిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటుంటే.. జ‌గ‌న్ మాత్రం నిష్క‌ర్ష‌గా వ్య‌వ‌హ‌రించ‌డం, వ్యాఖ్యానించ‌డం వ‌ల్ల ఆయా వ‌ర్గాల‌కు దూర‌మ‌వుతున్నార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపును ప్ర‌భావితం చేసే ప‌శ్చిమ‌, తూర్పుగోదావ‌రి జిల్లాలు స‌హా విశాఖ‌లో కాపుల‌ను ఇప్ప‌టికైనా వైసీపీ ప‌క్షానికి తిప్పుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వారు జ‌గ‌న్‌కు ప‌రోక్షంగా సూచిస్తున్నారు.



అటు అధికార పక్షం మరియు జనసేన ఈ మూడు జిల్లాలో నువ్వానేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. ఎన్నికలనాటికి  జనసేనలోకి కాపు సామాజిక వర్గానికి సంబందించిన అభ్యర్థులు  టీడీపీ , వైసీపీ నుండి పెద్దఎత్తున చేరబోతున్నారని ప్రచారం ఐతే రాజకీయ వర్గాల్లో ఉంది.

ఇప్పటికి ఐతే మాత్రం టీడీపీకి ఈ మూడు జిల్లాల్లో ఎదురులేదనే చెప్పాలి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం ఈ మూడు జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేసిన ఆర్చర్యపోవలసిన పనిలేదు.