ఆందోళనలో వైసీపీ నేతలు * బీజేపీతో పొత్తు వద్దు ... కాంగ్రెస్ ముద్దు అంటున్న నాయకులు

Saturday, 7 July 2018ఏపీ ప్రతిపక్ష పార్టీ గుండెల్లో మాత్రం ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. విభజన దెబ్బకు రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ మొన్నటివరకు ఉనికే లేకుండా ఉండి. అనూహ్యంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ రీఛార్జ్ అవుతోంది. ఏపీ వ్యవహారాల ఇంచార్జి గా నియమితులైన ఉమెన్ చాందీ ఇప్పటికే పార్టీకి దూరం అయిన పాత నాయకులని దగ్గరకు తీసుకునే పని మొదలు పెట్టారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి, హర్షకుమార్, ఆనం రాంనారాయణ రెడ్డి  ఇలా ఎంతోమంది నేతలు వున్నారు. వీరు కూడా కాంగ్రెస్ లో మళ్ళీ చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇదే జగన్ లో ఆందోళన పెంచుతోంది. ప్రతి  నియోజకవర్గంలో కాంగ్రెస్ కి కనీసం 10 వేల నుంచి 50 వేల ఓట్లు సాధించాలన్న లక్ష్యం తో ఉమెన్ చాందీ అడుగులు వేస్తున్నారు. పార్టీ సానుభూతిపరుల్ని ఒక్క చోటుకి చేర్చే సత్తా వున్న స్థానిక నాయకత్వం కోసం కాంగ్రెస్ వెతుకుతోంది. ఇప్పటికే కొంత మందిని గుర్తించింది. వారిని పార్టీలో తీసుకొచ్చి క్రియాశీలం చేసేలా చర్యలు చేపట్టింది. ఒకప్పుడు ఏపీ లో రెండు భుజాల వలే ఎస్సీలు, మైనార్టీలు కాంగ్రెస్ ని మోశారు. వైసీపీ ఏర్పాటు తర్వాత ఆ వర్గాల్లో చీలిక వచ్చి మెజారిటీ జనాలు జగన్ వైపు వెళ్లారు.ప్రస్తుతం  వైసీపీ అధినేత జగన్ బీజేపీ వైపు అడుగులు వేస్తుండటాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ యాక్టివ్ కావడంతో ఆ పార్టీ సానుభూతిపరులు తిరిగి అటువైపు చూస్తున్నారు. అలా నియోజకవర్గానికి చీలే 10 వేల ఓట్లు వైసీపీకి పడాల్సినవే. ఇదొక్కటి చాలు జగన్ కి అధికారం దక్కకుండా చేయడానికి. చచ్చిందనుకున్న పాము మళ్ళీ  బతికి కాటేయడం అబంటే ఇదే మరి.