వైసీపీ నాయకుల నిర్లక్ష్యం * ఇలా ఐతే ఎలా అని కార్యకర్తల ఆవేదన!

Sunday, 15 July 2018

తాము నామినేషన్ వేస్తే చాలు, ఎమ్మెల్యేలం అయిపోయినట్టే అని చాలా మంది  లెక్కలేసుకున్నారు. తమను చూసి ఎవరూ ఓటు వేయరు, జగన్ ను చూసి తమకు ఓటేస్తారనే బాపతు నేతలే చాలా మంది కనిపించారప్పుడు. తాము గాలికి ఎమ్మెల్యేలం అయిపోతున్నామని వీళ్లు భావించారు. విశేషం, విడ్డూరం ఏమిటంటే.. ఇప్పటికీ వైసీపీలో ఇలాంటి వారు మళ్లీ కనిపిస్తున్నారు. తాము జనాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు, తాము గట్టిగా కష్టపడలేం కూడా, డబ్బును కూడా ఖర్చు పెట్టలేం.తమను చూసి ఎవ్వరూ ఓటు వేయరు.. వేస్తే జగన్ ను చూసి వేయాలి, జగన్ ఇంకా కష్టపడాలి, ఇంకా ఏదేదో చేసేయాలి.. తమను గెలిపించడానికి జగన్ కష్టపడాలి, జగన్ సీఎం కావాలనే ఆకాంక్షతో ఉన్నాడు... కాబట్టి తమను గెలిపించడానికి చాలా కష్టపడతాడు.తాము మాత్రం ఏమీ చేయనక్కర్లేదు. చుట్టూ పది మందిని పెట్టుకుని జేజ కొట్టించుకొంటూ, ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టించుకొంటూ ఉంటే చాలు.. ఎమ్మెల్యేలం అయిపోతాం.. అని చాలా నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీ ఇన్ చార్జిలు భావిస్తున్నారు. కొడితే జాక్ పాట్, ఎమ్మెల్యేలం అయిపోతాం. కొట్టలేదో.. అది జగన్ వైఫల్యం, జగన్ బాగా కష్టపడితే తాము ఎమ్మెల్యేలం అవుతాం, లేకపోతే లేదు.. అన్నట్టుగానే చాలా మంది ఇన్ చార్జిలు వ్యవహరిస్తున్నారు. ఇప్పడూ ఈ ఎమ్మెల్యేల వ్యవహారమే జగన్ కు శాపంలా మారొచ్చు అని చెప్పాలి.