విజయసాయి రెడ్డిని చూసి నవ్వుకుంటున్న వైసీపీ నేతలు

Monday, 2 July 2018ఆడిటర్‌గా ఉంటూ జగన్ ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టిన విజయసాయిరెడ్డిని అనుకోని పరిస్థితులు రాజకీయాల వైపునకు నెట్టేశాయి. మొట్టమొదటి అడుగులోనే రాజ్యసభలో మెంబర్‌షిప్ దక్కించుకుని.. వైసీపీకి ఢిల్లీలో మౌత్ పీస్‌గా ఎదిగారు. బాబుకు ఆయన పెట్టిన కొన్ని ‘నిక్ నేమ్స్’ విపరీతంగా వైరల్ అయ్యాయి కూడా.

మొన్నీమధ్యే.. తిరుమల శ్రీవారి ఆభరణాలు హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంట్లో దొరుకుతాయి.. సోదా చెయ్యండి అంటూ దండోరా వేసినప్పుడు విజయసాయిరెడ్డి ‘వాయిస్’ మీడియాలో మరింత స్పైసీగా మారింది. అటువంటి ప్రకటన చేయడం ద్వారా.. వైసీపీకి ఎంత లబ్ది పొందిందన్న లెక్కల కంటే.. ఆయన ఇమేజ్‌కి మాత్రం కొంత డ్యామేజ్ జరిగిందన్న వాదన వినిపించింది. దీన్ని తుడిపేసుకోడానికేనన్నట్లు విజయసాయిరెడ్డి పుస్తక రచయితగా సరికొత్త ‘అవతారం’ ఎత్తేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్ర మీద తానే స్వయంగా రాసిన ఒక పుస్తకాన్ని త్వరలోనే ఆవిష్కరింపజేస్తానంటూ ట్వీట్ చేశారు.

వెంకటేశ్వరుడి వైభవం, నివాసం, ఆచారాలు, సాంప్రదాయాలను తెలియజేసే ఈ పుస్తకం ‘గ్లోరీ ఆఫ్‌ లార్డ్‌ వెంకటేశ్వర’ అనే పేరుతో తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, గుజరాతీ భాషల్లో విడుదల కానుందట! మా సాయన్నలో ఈ యాంగిల్ కూడా ఒకటుందని మాకే తెలీదు సుమా.. అంటూ సొంత పార్టీలోనే ఛలోక్తులు పడిపోతున్నాయి. ఏదేమైనా రాజకీయాల్లో భలే బిజీగా ఉంటూ.. జగన్‌ని సీఎంగా చూడడమే లక్ష్యంగా యాక్షన్ పార్ట్‌లో దిగేసిన విజయసాయిరెడ్డికి ఒక ‘సమగ్ర ఆధ్యాత్మిక పుస్తకం’ రాసేంత గ్యాప్ ఎక్కడ దొరికిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!