టీడీపీలోకి ముద్రగడ?

Monday, 30 July 2018


ఏడెనిమిది నెలల కిందట ఘనంగా వినపడ్డ ఈ మాటలు ఇప్పుడు మళ్ళీ రీసౌండ్ ఇస్తున్నాయి. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ట్రెమండస్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ముద్రగడ...తనతాజా రాజకీయ వైఖరిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. జగ్గంపేటలో జగన్ చేసిన ‘యాంటీ కాపు’ స్టేట్మెంట్‌తో మనస్తాపం చెందిన ముద్రగడ పద్మనాభం.. ‘కాపు జాతికి జగన్ వెన్నుపోటు పొడిచారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపుల రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతునిచ్చిన జగన్.. అదే నోటితో రిజర్వేషన్లు అసాధ్యం అంటూ ప్రకటించడం శోచనీయమన్న ముద్రగడ స్టేట్మెంట్ ఏపీ పాలిటిక్స్‌లో ఒక కీలక అంశం. మొన్నటివరకూ చంద్రబాబును ఏకిపారేసి, జగన్ వెంట వున్న ముద్రగడ ఇలా ప్లేటు ఫిరాయిస్తారని కల్లో కూడా అనుకోలేదంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు గొల్లుమన్నారు. 

ఈ క్రమంలోనే.. కాపులకు కార్పొరేషన్ పెట్టి, ఎంతోకొంత నిధులిచ్చి, రిజర్వేషన్ల కోసంఅసెంబ్లీ తీర్మానం ఆమోదించి ఢిల్లీకి పంపిన చంద్రబాబు.. చిత్తశుద్ధి విషయంలో జగన్ కంటే ముందు నిలబడినట్లు ముద్రగడ సన్నిహితులు మీడియాతో చెబుతున్నారు.

గతంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటికెళ్లి మరీ మంతనాలాడారు ముద్రగడ 
పద్మనాభం. ఉద్యమ తీవ్రతను తగ్గించాలంటూ అప్పట్లో టీడీపీ మిత్రపక్షం బీజేపీ కూడా ముద్రగడను బుజ్జగించింది. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణే ముద్రగడను వెంటబెట్టుకుని గోరంట్ల ఇంటికెళ్లినట్లు వార్తలొచ్చాయి. అప్పటినుంచీ ఏదోవిధంగా తెలుగుదేశంలో చేరేలా ఆయనపై ఒత్తిడి పెంచుతూనే వున్నారు సీఎం చంద్రబాబు. 

ముద్రగడను మచ్చిక చేసుకుంటే 90 శాతం కాపు సామాజికవర్గం తమతోనే ఉన్నట్లన్నది 
తెలుగుదేశం అంచనా. అందుకే.. జగన్ చెయ్యిచ్చాడంటూ బాహాటంగా చెప్పిన నేపథ్యంలో ముద్రగడపై మళ్ళీ ‘పచ్చ’ గాలం పడిపోయిందని చెబుతున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ముద్రగడకు ఈసారి రాజ్యసభ సీటిచ్చి ‘గౌరవించాలన్నది’ టీడీపీ వ్యూహంగా తెలుస్తోంది. కానీ.. చంద్రబాబుకు, జగన్‌కీ సమాన దూరం పాటిస్తూ వచ్చిన ‘కాపు సింహం’ ముద్రగడ.. ఈ మలుపులో ఎటువైపు తిరుగుతారన్నది సస్పెన్స్!