జనసేనలోకి మైసూరా రెడ్డి ?

Thursday, 12 July 2018


రాయలసీమ నుంచి మరో సీనియర్ రాజకీయ నాయకుడు.. జనసేనకు కన్ను గీటేశారు.మాజీ ఎంపీ, మాజీ  
మంత్రి ఎంవీ మైసూరా రెడ్డి.. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి పాల్వంచకొచ్చారు. ఆ సందర్భంలో ఆయాచితంగా ఆయనన్న కొన్ని మాటలు వర్తమాన రాజకీయాల్లో ఆసక్తిని రేపాయి. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని, అనూహ్య మార్పులు రావడం తథ్యమని మైసూరా అన్నారు. ఎలా అని అడిగితే.. పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజాకీయాల్లోకొచ్చారు. జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తోంది.. అది చాలదా సంచలనానికి దారిపడ్డానికి.. అంటూ ఎదురు ప్రశ్నించారు.

 పైగా ప్రత్యేక సీమ సాధనకు, సీమ కరవు నివారణకు కష్టపడతానని పవన్ కల్యాణే చెప్పారుగా అంటూ   
సాగదీశారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ భావజాలం మైసూరాను ఆకర్షించాయని, పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగా వున్నారని ఆయన అనుచరవర్గం మీడియా చెవుల్లో చెబుతోంది. ఒకప్పుడు అన్ని పార్టీల్లోనూ ఒక వెలుగు వెలిగి, ప్రస్తుతం వైసీపీ నుంచి విడిపడి.. ఏ పార్టీతోనూ సంబంధాల్లేకుండా ‘ఖాళీ’గా వున్న మైసూరా లాంటి సీనియర్లను జనసేన కూడా వదులుకునే పరిస్థితిలో లేదు. ఈ లెక్కన.. పవన్ ‘హిట్‌లిస్ట్’లో మైసూరా వున్నట్లే మరి!