టీడీపీలో సీట్ల పంపకం షురూ చేసిన బాబు

Friday, 6 July 2018ఏపీ రూలింగ్ పార్టీలో కూంబింగ్ షురూ అయ్యింది. ఎన్నికల వేడి ఊపందుకోవడంతో బీఫారాల లెక్క తేల్చడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైందని, ప్రస్తుతం ఏరివేత కార్యక్రమం జోరుగా సాగుతోందని చప్పుళ్ళు రావడంతో.. ‘కొత్త తమ్ముళ్లు’ బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంపయిన ఒకటిన్నర డజను మంది ఎమ్మెల్యేల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టి.. స్థానికంగా వీళ్లందరి స్టేటస్ రిపోర్ట్ తయారుచేస్తున్నట్లు చెబుతున్నారు.

సరిగ్గా ఎన్నికలకు ముందు పోటీ పెరిగి.. ఉక్కబోతతో ఇబ్బందిపడకుండా యిప్పటినుంచే.. గ్రౌండ్ ప్రిపేర్ చేయాలన్నది బాబు ప్లాన్‌గా తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే బాబు దగ్గర గొంతు పెంచి మాట్లాడి తర్వాత ఇబ్బంది పడ్డారని, నీ జాతకం నా దగ్గరుంది జాగ్రత్త తమ్ముడూ అంటూ సీఎం హెచ్చరించారని వార్తలొస్తున్నాయి. అటు.. ఉత్తరాంధ్రలో సైతం జనసేన దూకుడు నేపధ్యాన్ని టీడీపీ అధిష్టానం తీక్షణంగా పరిశీలిస్తోంది. మూడు జిల్లాల్లో కలిపి నాలుగు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి ఫిరాయించే అవకాశమున్నట్లు అంచనా వేసుకుంది కూడా.

ఇటు.. క్యాబినెట్ విస్తరణ మీద చంద్రబాబు స్పష్టమైన సంకేతాలిచ్చిన క్రమంలో.. కూడికలు, తీసివేతలపై తీవ్ర చర్చ జరుగుతోంది. కనీసం ఇద్దరు మంత్రులకు పింక్ స్లిప్ ఇచ్చేసూచనలున్నాయని, ఒక మైనారిటీ ఎమ్మెల్యేకు ఛాన్స్ దక్కవచ్చని బాబుగారే స్వయంగా చెప్పారట! ఏదేమైనా.. రాబోయే నెలరోజుల్లోగా.. ఏపీ పాలిటిక్స్‌లో ప్రకంపనలు ఖాయమన్నది క్లియర్.