చంద్ర‌బాబు అడిగితే క‌డ‌ప స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ ఇచ్చే ప్ర‌స‌క్తే లేదు - సోము వీర్రాజు

Saturday, 30 June 2018' ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబునాయుడు అడిగితే క‌డ‌ప స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ ఇచ్చే ప్ర‌స‌క్తే లేదు' ..  ఇవి బిజెపి సీనియ‌ర్ నేత‌, ఎంఎల్సీ సోము వీర్రాజు తాజా వ్యాఖ్య‌లు. ఆయ‌న స్టేట్మెంట్ వింటే ఎవ‌రికైనా ఏమ‌నిపిస్తుంది ?    వీర్రాజు మాట‌ల్లో అహంకార‌మే క‌నిపిస్తుంద‌న‌టంలో సందేహ‌మే లేదు. ఎందుకంటే, ఒక రాష్ట్రానికి అందాల్సిన ప్ర‌యోజ‌నాలు ముఖ్య‌మంత్రిని బ‌ట్టే కాకుండా రివాజుగా రావాల్సిన‌వి కూడా ఉంటాయి. అంతేకాని అచ్చంగా ముఖ్య‌మంత్రిపై కోపంతో ఆ రాష్ట్రానికి  ద‌క్కాల్సిన వాటిని ఇచ్చేది లేదంటే కుద‌ర‌దు.చంద్ర‌బాబు అడిగితే స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని ఏ అధికారంతో వీర్రాజు చెబుతున్నారో అర్దం కావ‌టం లేదు. ఆయ‌న చెప్పే కార‌ణం ఏమిటంటే, చంద్ర‌బాబు అవినీతిప‌రుడ‌ట‌, అవినీతిప‌రుల‌కు స‌హ‌క‌రించేది లేద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి ఎప్పుడో స్ప‌ష్టం చేశార‌ట‌. వీర్రాజు వాద‌నే విచిత్రంగా ఉంది. ఎందుకంటే,  ప్ర‌త్యేక‌హోదా, ప్ర‌త్యేక రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్ అన్న‌ది చంద్ర‌బాబు అడ‌గ‌టం కాదు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలోనే ఉంది. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు స్ధానంలో ఎవ‌రున్నా కేంద్రం ఇచ్చి తీరాల్సిందే,  వేరే దారిలేదు. కాదు కూడ‌దు ఇవ్వ‌నంటారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌నాలు ఏం చేయాలో బిజెపికి అది చేయ‌క‌మాన‌రు. 

ఎన్డీఏలో ఉన్నంత కాలం చంద్ర‌బాబు అవినీతి గురించి మోడి, బిజెపిల‌కు తెలీదా ?  నిజంగానే చంద్ర‌బాబు అవినీతిప‌రుడైతే ఎందుకు విచార‌ణ  జరిపించి  కేంద్ర‌ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌టం లేదు ? స‌రే, ఆ విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే అవినీతి ఆరోప‌ణ‌లు ఒక్క చంద్ర‌బాబు మీదే ఉన్నాయా ?  బిజెపి పాలిత ముఖ్య‌మంత్రుల మీద లేవా ?  రాజ‌స్ధాన్ సిఎం వ‌సుంధ‌రా రాజే సింధియా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్, హ‌ర్యానా సిఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్, మ‌హారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ పైన కూడా ఎన్నో ఆరోప‌ణ‌లున్న సంగ‌తి వాస్త‌వం కాదా ?  మ‌రి వారి విష‌యంలో కూడా వీర్రాజు అదే విధంగా మాట్లాడ‌గ‌ల‌రా ?

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు  న‌రేంద్ర‌మోడి ఏర‌కంగానూ స‌హ‌క‌రించ ద‌ల‌చుకోలేద‌న్న‌ది అర్ధ‌మైపోతోంది.  అందుకు చంద్ర‌బాబును అడ్డం పెట్టుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపికి సీట్లు వ‌స్తాయ‌నే ఆశ ఉన్న‌ట్లు లేదు. అందుక‌నే  పూర్తిగా నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. ఆ విష‌యం బ‌హిరంగంగా అంగీక‌రించే ధైర్యం లేక వీర్రాజు కుంటిసాకులు చెబుతున్నారు.